ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచిలో జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ కి అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచిలో సభ్యత్వం లభించింది. ఒక తెలుగు సినిమా హీరోకి మొట్టమొదటిసారిగా దక్కిన గౌరవం ఇది.


Published on: 19 Oct 2023 15:54  IST

 

 

జూనియర్‌ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచిలో ఆయనకు సభ్యత్వం లభించింది. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ కొత్త సభ్యుల ఎంపికలో భాగంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ను కూడా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది. ’ఆర్‌ఆర్‌ఆర్‌’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఎంపిక చేయడంతో పాటు మరో నలుగురు హాలీవుడ్‌ నటులకు కూడా ఇందులో స్థానం కల్పించింది. జూనియర్‌ ఎన్టీఆర్‌తో పాటు ఈ జాబితాలోకి ఎంపికైనవారిలో కే హుయ్‌ క్వాన్, మార్షా స్టెఫానీ బ్లేక్, కెర్రీ కాండన్, రోసా సలాజర్‌ కూడా ఉన్నారు. ’అంకితభావం కలిగిన ఈ నటీనటులు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించారు. తెరపై వారి హావభావాలతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. అలాంటి గొప్ప నటీనటులను యాక్టర్స్‌ బ్రాంచ్‌ లోకి ఆహ్వానిస్తున్నాం. ఇలాంటి గొప్ప నటీనటులను బ్రాంచ్‌లోకి ఆహ్వానించడం థ్రిల్‌గా ఉంది’ అంటూ అకాడమీ ఈ సందర్భంగా పేర్కొంది. 

ప్రస్తుతం ఈ వార్త జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతోంది. అకాడమీ చేసిన పోస్ట్‌ను సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ చేస్తున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌కు కూడా అభిమానులు, సినీ ప్రముఖులు  శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం తారక్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తీస్తున్న విషయాన్ని ఇటీవల డైరెక్టర్‌ కూడా ప్రకటించడం గమనార్హం. ఈ చిత్రం మొదటి భాగంగా 2024 ఏప్రిల్‌ 5న విడుదల చేస్తామని కూడా ఈ చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. దీంతో పాటు హృతిక్‌ రోషన్‌ చిత్రం ‘వార్‌–2’లోనూ ఎన్టీఆర్‌ నటిస్తుండటం తెలిసిందే.

Source From: junior ntr