నకిలీ టోల్ ప్లాజా.. 75 కోట్ల వసూళ్లు


Published on: 09 Dec 2023 13:25  IST



అక్కడ ఏడాదిన్నర కాలంగా నకిలీ టోల్‌ప్లాజా నడుపుతున్నారు.. దీనికోసం ఏకంగా రోడ్డే వేసేశారు.. ఓ సిరామిక్‌ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకొని దర్జాగా టోల్‌ప్లాజా నిర్వహిస్తున్నారు.. ఆ మార్గంలో అనేకమంది అధికారులు కూడా ప్రయాణాలు సాగించారు.. అయినా.. అది నకిలీదని గుర్తించలేదు.. ఈ ఘరానా మోసం జరిగింది ఎక్కడో కాదు.. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహించిన.. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌ రాష్ట్రంలో కావడం గమనార్హం. దీనిని బట్టి అక్కడి అధికారుల పనితీరు ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు.


ఈ టోల్‌ ప్లాజాపై ఇటీవల మీడియాలో కథనాలు వెలువడటంతో మోసగాళ్ల గుట్టు రట్టయింది. గుజరాత్లోని మోర్బీ జిల్లాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. మోర్బీ, కచ్‌ జిల్లాలను కలిపే 8ఏ నంబరు జాతీయ రహదారిపై వాఘసియా టోల్‌ప్లాజా ఉంది. దీనిని తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు పక్కనున్న ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్తుండేవారు. దీనిని గమనించిన మోసగాళ్లు.. ఆ మార్గంలో నిరుపయోగంగా ఉన్న ఓ సిరామిక్‌ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకొని టోల్‌ప్లాజాగా మార్చేశారు. దానికి ఇరువైపులా హైవే వరకు బైపాస్‌ రోడ్డు నిర్మించారు. హైవేపై ఉన్న టోల్‌ప్లాజా చార్జీల కంటే తక్కువగా వసూలు చేస్తుండటంతో వాహనదారులు కూడా దీనిపై ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఈ ఏడాదిన్నరకాలంలో టోల్‌ప్లాజా నిర్వహిస్తున్న మోసగాళ్లు దాదాపు రూ.75 కోట్లు అక్రమంగా వసూలు చేసేయడం గమనార్హం.

ఈ ఉదంతం వెలుగు చూడటంతో అలర్ట్‌ అయిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వారిలో ఒకరు ఆర్మీ రిటైర్డ్‌ ఉద్యోగి.. మరొకరు పాటిదార్‌ వర్గ ప్రముఖ నేత కుమారుడు కావడం గమనార్హం. ఇదేకాదు.. గుజరాత్‌లోని దాహోద్‌ జిల్లాలో ఇటీవల ఓ నకిలీ ప్రభుత్వ ఆఫీసు గుట్టు సైతం బయటపడింది. దాన్ని ఛేదించగా.. అలాంటివి మరో ఆరు ఉన్నట్టు తేలింది. ప్రభుత్వ ఆఫీసులంటూ ప్రజలను నమ్మించి రూ.18 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. ఆ కేసులో ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

Source From: Fake toll plaza