చెల్లిని కొట్టాడని బావ, అత్త, మామను చంపేశాడు

కుటుంబ కలహాలే ముగ్గురిని కబళించాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్థల పంచాయితీ చినికిచినికి గాలివానలా పెద్ద గొడవలా మారి మూడు ప్రాణాలను బలితీసుకుంది. హృదయ విదారకమైన ఈ ఘటన ఏపీలోని పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో గురువారం జరిగింది.


Published on: 24 Nov 2023 10:51  IST

కోనంకి గ్రామానికి చెందిన అనంత నరేష్‌ (30)తో ఆరేళ్ల క్రితం ముప్పాళ్ల మండలం దొమ్మలగూడెం గ్రామానికి చెందిన మాధురికి పెళ్లయింది. వీరికి వేణుగోపాల్‌ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. నరేష్‌కి సుమారు 15 ఎకరాల భూమి ఉంది. ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తూ, ఉన్న పొలం పనులు చేస్తూ ఉండేవాడు. నరేష్‌ పిసినారి. పిసినారితనం వల్ల తరచూ భార్యా భర్తల మధ్య మనస్పర్థలు వస్తుండేవి. ఈ క్రమంలోనే మాధురికి బుధవారం ఉదయం కడుపునొప్పి రావడంతో పిడుగురాళ్ల పట్టణంలోని ఆస్పత్రిలో చూపించాలని భర్త నరేష్, మామ సాంబయ్య(56)ను కోరింది. దీనికి వారు నిరాకరించారు. అంతేకాదు పొలం పనికి వెళ్లాలని బలవంతపెట్టారు. దీంతో మాధురి తన అన్న దోమా శ్రీనివాసరావుకు ఫోన్‌ చేసింది.

 

అతను తన తండ్రి సుబ్బారావుతో కలిసి వెంటనే బైక్‌పై కోనంకి వచ్చాడు. మాధురి తన తండ్రి, సోదరుడికి విషయం చెబుతుండగానే నరేష్‌ భార్యపై చేయిచేసుకున్నాడు. దీంతో గొడవ చినికి చినికి గాలివానలా మారింది. తమ ముందే తన చెల్లెలిని కొట్టడాన్ని భరించలేని శ్రీనివాసరావు ఆగ్రహంతో అక్కడే ఉన్న కత్తితో బావమరిది అనంత నరేష్‌ని పొడిచాడు. నిర్ఘాంతపోయిన నరేష్‌ తండ్రి సాంబయ్య(56) శ్రీనివాసరావుపైకి రావడంతో అతడినీ కత్తితో పొడిచాడు. తండ్రి, కొడుకులిద్దరూ రక్తపుమడుగులో పడి ఉండడాన్ని చూసిన నరేష్‌ తల్లి ఆదిలక్ష్మి (50) రోదిస్తూ దగ్గరకు రావడంతో ఆమెనూ శ్రీనివాసరావు విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడు. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. అర్ధరాత్రి కావడంతోపాటు వాన కురుస్తుండటంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. తెల్లవారుజామున విషయం బయటకు వచ్చింది. 
 

Source From: parnadu murders