అమ్మ భాష ఎలా మారిపోతుందో తెలుసా !

మన అమ్మ భాష తెలుగు తీరుతెన్నూ మారిపోతోంది. కొన్ని అక్షరాలు మారిపోతుంటే, కొన్ని ఒత్తులు అసలు లేకుండా ఎగిరిపోతున్నాయి. దీర్ఘాలు, పొల్లులకు వచ్చిన కష్టం అంతా ఇంతా కాదు. ఆగష్టు 29వ తేదీన, గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మన తెలుగు భాష శృతి ఎలా తప్పుతుందో తెలిపే వ్యాసం..


Published on: 29 Aug 2024 14:36  IST


‘మా పిల్లలకు తెలుగు రాదు అండి, నాకు తెలుగు వ్రాయడం రాదు అండి, నేను తెలుగు మాట్లాడటం తప్పా చదవలేను, వ్రాయలేను అండి‘ అని షోకుల కాకులు బడాయి కోసం ఇలా ఎన్ని మాటలు  చెప్పినా కానీ మనం ఆలోచించేది మాత్రం మన మాతృభాష తెలుగులోనే.....

మాతృ భాషకు అర్థం ఏమంటే ఒక వ్యక్తి తనలో తాను మాట్లాడుకునే,  ఆలోచించుకునే భాషే అతని మాతృభాష అని చెప్తారు. ఈ మధ్య కాలంలో చాలా ప్రసార మాధ్యమాలలో చూస్తుంటే అసలు స్వచ్ఛమైన, అక్షర దోష రహిత తెలుగు ఎంత మందికి తెలుసు అనే అనుమానం వస్తుంది.

‘ళ‘ అక్షరం క్రమేపీ తనువు చాలించే రోజు ఎంతో దూరం లేదు అనిపిస్తుంది. పెళ్లి, కళ్ళు కాస్త పెల్లి, కల్లు అయ్యాయి. అది త్రాగే కల్లునా లేక చూసే కళ్లు నా అని ఒకటే అయోమయం. కానీ మెల్ల మెల్లగా ఆ అయోమయమే అసలైన అర్థం అని భావి తరాలు భావించే ప్రమాదం కూడా పొంచి ఉంది.

ఇక ఒత్తులు సంగతి వేరే చెప్పనక్కర్లేదు. అవి దీపాలలో వత్తులు మాదిరి అక్కడక్కడా మాత్రమే తళుక్కుమంటున్నాయి. ఆ మెరుపు కూడా మెరవాల్సిన స్థానంలో కాకుండా వేరే అవసరం లేని చోట అనవసరంగా మెరిసి, ఆ మెరుపు కాస్తా అడవి కాచిన వెన్నెలయే అవుతుంది.

ఈ మధ్యనే ఒక ఫ్లెక్సీ కోసం యోధుడు అని వ్రాయమంటే యోదుడ అని వ్రాసి, ఎన్ని సార్లు నేను చెప్పినా కూడా ఆ డిటిపి వాడికి అర్థం చేసుకునే ఓపిక లేక చివరకు యోధుడు కాస్త లేగ దూడ లాగా ‘యోదుడ‘ గానే ఉండిపోయాడు. చివరకు తల బాదుకోవడమే నా వంతు అయింది.

దీర్ఘాలు, ఒత్తులు, పొల్లులు ఎన్నెన్ని అవమానాలకు, అనుమానాలకు, ఎత్తు పల్లాలకు గురవుతున్నాయో చెప్పనలవి కాదు.

బండి ‘ఱ‘ ఏనాడో బండెక్కేసి మాయమైపోయింది. ‘ఋ‘ కూడా ‘రు‘ ఆధిపత్యానికి గురై మెల్లగా నీరసించి, ఋతు పవనాలు రావలసిన సమయంలో ‘రుతు పవనాలు‘ వచ్చి, అతి త్వరలో కనపడకుండా కొట్టుకు పోవచ్చు అని తెలుగు భాషా ప్రేమికుల మనో వ్యధ..

యాభై ఆరు అక్షరాల తెలుగు కాస్త ఇరవై ఆరు అక్షరాల ఆంగ్ల పెత్తనానికి గురై మెల్లగా కనుమరుగయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ నివేదికలు ఎన్ని చెప్పినా మనకు తెలుగంటే చిన్న చూపే. కానీ అది ప్రతీ తెలుగు వాడికి కంటి చూపు అని మర్చి పోకూడదు మనం.

మన సహస్రావధాని మాడుగుల నాగ ఫణి శర్మ గారు అన్నట్లు ‘తెలుగు భాష అమ్మ భాష. ఆంగ్ల భాష అలంకార భాష‘. అంటే తెలుగు భాష మనకు కళ్ళ వంటిదైతే దానికి అలంకారం కోసం రాసుకునే కాటుకయే ఆంగ్ల భాష. అంటే కాటుక కంటి వరకు రాసుకుంటే మాత్రమే అందం కానీ ఒళ్లంతా పూసుకుంటే ఎంతో అసహ్యంగా ఉంటుంది చూడటానికి. అందుకే అవసరం కొద్దీ ఆంగ్ల భాష వాడవచ్చు కానీ అవసరం లేని చోట కూడా తెలుగుని టెలుగు చేస్తే టెంకాయ పట్టుకుని మరీ మొట్టికాయ వేయ వలసిందే. అందుకే తెలుగు మనకు అమ్మ భాష అయితే ఆంగ్లం కేవలం అవసరం కోసం మాత్రమే వాడవలసిన భాష.

చక్కటి తెలుగు భాష పిల్లలు నేర్చుకోలేక పోవడానికి ప్రధాన కారణం మన విద్యా వ్యవస్థ. ప్రస్తుత సమాజంలో చాలా మంది అరకొర మార్కులతో, అంతంత మాత్రం చదువులతో ఉద్యోగాలు సంపాదించి, ఉపాధ్యాయుల అవతారం ఎత్తుతున్నారు. పిల్లలకు చక్కటి భాష నేర్పాలన్నా, వేరే విషయాలు బోధించాలన్నా కూడా ముందుగా ఉపాధ్యాయులకు ఆ అంశాలలో ప్రజ్ఞా, పాటవాలు మెండుగా ఉండాలి. అవి ఏ మాత్రం లేని వారిని ఉపాధ్యాయ వృత్తిలోకి తీసుకున్న మన దేశ రాజకీయ వ్యవస్థ మాతృ భాçషకు, మన దేశ ప్రగతికి చేస్తున్న ప్రధాన ద్రోహం..

ఇక్కడ ఏ ఒక్క ఉపాధ్యాయుడిని కించపరిచే ఉద్దేశ్యం నాకు ఏ మాత్రం లేదు. కేవలం ఆదరణ తగ్గిపోతున్న మన మాతృ భాష తెలుగు మీద ప్రేమ, నాణ్యత తగ్గిపోతున్న విద్య వల్ల భావితరాల భవిష్యత్‌ మీద ఆవేదన తప్పా....

ఎవరి మాతృ భాష అయితే అంతరించి పోతుందో వారి నాగరికత, మూలాలు కూడా అంతరించినట్లే అని చరిత్రకారుల ఉవాచ. అందుకే చక్కటి తెలుగును నేర్చుకుందాం. మన తరువాత తరాలకు కూడా తప్పకుండా నేర్పుదాం.

 

రచయిత 
మోదుగుమూడి రాజశేఖర్, ఏలూరు
ఫోన్‌: 7995116053. 
 

Source From: telugu bhasha dinotsavam