తెలుగు సినిమా.. ఎలా మొదలైంది? ఇప్పుడెలా ఉంది !

మన తెలుగు సినిమా ఖండాంతరాలకు వ్యాపించింది. మూకీ సినిమాల నుంచి వందల కోట్ల స్థాయికి చేరిన మన సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎవరి చేతుల్లో ఉంది? మన సినిమా ఎలా ప్రారంభమైంది. వందేళ్ల క్రితం ఎలా ఉంది? ఇప్పుడు కేవలం ఒక వర్గం చేతుల్లో ఎలా చిక్కుకుంది. విశ్లేషణాత్మక కథనం.


Published on: 20 Aug 2024 20:46  IST


సినిమాకి ముందు రూపం నాటకం.. దానికంటే ముందు తోలు బొమ్మలాట.. గుడ్డి దీపాల వెలుగులో, అలసిన మనసులకు వినోదం అందించాయి తోలు బొమ్మలు. వీటి గురించి ఈ తరానికి అసలు తెలియదు. అమ్మా నాన్నలు చెబితే వినడమే తప్ప మా తరం కూడా వాటిని చూడలేదు.

వీటి ఉనికికి కారణం మనిషిలోని హాస్య అభిరుచి, చతురత, నటన, భావ ప్రకటన, భంగిమలు. వీటన్నింటినీ కలిపి ఒక కల్పితమైన లేదా వాస్తవికతను ప్రతిబింబించే వినోదాత్మక, సందేశాత్మక, హాస్యమిళిత సన్నివేశాన్ని సృష్టించడమే నాటకమైనా లేదా సినిమా అయినా..

రోజంతా పొలాల్లో హలాలు దున్ని, కాయ కష్టం చేసి, సాయంత్రం ఇంటికి చేరిన రైతులకు పూర్వం తోలు బొమ్మలాటలు, నాటకాలే మానసిక ఉల్లాసాన్ని కలిగించేవి. ఈ ప్రక్రియలో కేవలం వినోదం అనేది సంతోషం మాత్రమే. అందులో ఎలాంటి వ్యాపార దృక్పథం ఉండేది కాదు. అప్పట్లో ఇంకా డబ్బున్న ధనికులైతే వేశ్యలతో లేదా ఉంపుడుగత్తెలతో సరదాలు, సరస సల్లాపాలు సాగించేవారు. అందుకోసం ఏర్పడినవే భోగం మేళాలు, రాజసాని గ్రామాలు. 

తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం పట్టణం ఒక నాటి రాచరిక వినోదపు సాని వ్యవస్థలో భాగమేనని చెబుతారు. అలనాటి రాజుల మానసిక, లైంగిక ఆనందం కోసం ఏర్పడిన గ్రామమే పెద్దాపురం అని ప్రతీతి.

ఇక ప్రస్తుత సినిమా విషయానికి వస్తే..

15, 16వ శతబ్దాల్లోనే యూరోప్‌లో షేక్‌ స్పీయర్‌ నాటకాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. అదే సమయంలో మన దేశంలో పౌరాణికాలు, పద్య నాటకాలు, గద్యనాటకాలు ఎంతో  ప్రసిద్ధి చెందాయి.

రానురానూ టెక్నాలజీ పెరిగి నాటకాలు బాగా తగ్గిపోయాయి. వాటి స్థానంలో కదిలే చిత్రాలు మూకీలుగా వచ్చాయి. అవి మనం చూసిన చార్లీ చాప్లిన్‌ సినిమాలు వంటివి. టెక్నాలజీ ఇంకా పెరగడంతో మాట్లాడే సినిమాలు టాకీలుగా వచ్చాయి. అలసిన మనసుకు వినోదం కోసం సృష్టించిన ఈ సినిమా కాలక్రమంలో అనేకమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేసే వ్యవస్థగా మారి పెద్ద పరిశ్రమగా రూపుదిద్దుకుంది. 

మన తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్యనాయుడు. మనకు తెలిసిన తొలితరం నటీమణి దేవిక. 1940వ దశకంలో తెలుగు సినిమాలను ఎక్కువగా నిర్మించింది బీఎన్‌ రెడ్డి, నాగిరెడ్డి, కేవీ రెడ్డి, ఆలూరి చక్రపాణి, సి. పుల్లయ్య, ఏలూరు సమీపంలోని సోమవరప్పాడు గ్రామానికి చెందిన అక్కినేని లక్ష్మీ వరప్రసాద్‌ (ఈయనే మన ఎల్వీ ప్రసాద్‌.. ప్రసాద్‌ లాబ్స్‌ వ్యవస్థాపకులు) వంటి ప్రముఖులు. 

అలా మొదలైన తెలుగు సినిమా ప్రస్థానం మెల్లగా మెల్లగా, అంచెలంచెలుగా ఎదిగి యావత్‌ భారతదేశంలోనే అతి ఖరీదైన బాహుబలి వంటి పాన్‌ ఇండియా తీసే కార్పొరేట్‌ స్థాయికి ఎదిగింది. ఇది  నిజంగా తెలుగు వారందరికీ ఎంతో గర్వించదగ్గ విషయం. సినీ ప్రపంచంలోనే తెలుగు వాడి కీర్తి పతాకాన్ని ప్రపంచ నలుమూలలా ఎగురవేసింది మన బాహుబలి సినిమా.  

ఇదంతా నాణేనికి ఒక వైపు....

చాలా మందికి తెలియకుండా నాణేనికి రెండో వైపు సినీ మాఫియా వేళ్లూనుకుని ఉంది. ఇక్కడ మాఫియా అని ఎందుకు అన్నాను అంటే అసలు ఇంత కీర్తి గడించిన తెలుగు సినిమా వల్ల అంతిమంగా ఇప్పటి వరకు లాభం పొందింది కేవలం రెండు లేదా మూడు తెలుగు కులాలు కమ్మ, కాపు, రెడ్డి వర్గాల వారే. వారిలో కూడా కేవలం కొన్ని కుటుంబాలే. 40వ దశకంలో రెడ్లు సినిమా నిర్మాతలుగా ఉండేవారు. కమ్మ వాళ్ళైన ఎన్టీఆర్, ఏఎన్నార్‌ లాంటి వాళ్ళు తొలి తెలుగు హీరోలుగా ఎదిగారు. ఆ తర్వాత తెలుగు సినిమా అనతి కాలంలోనే కమ్మ వాళ్ళ ఆధిపత్యంలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా ఎక్కువ భూస్వాములు,« దనికవర్గం కూడా ఈ కమ్మ, రెడ్లు మాత్రమే. అక్కడక్కడా కొంతమంది కాపులు, రాజులు ఉన్నారనుకోండి.

కాయకష్టం చేసుకునే రైతుకు, కార్మికుడికి, కర్షకులకు ఈ సినిమా కేవలం వినోదం మాత్రమే అందించింది. వారి కష్టార్జితంతో టికెట్‌ కొనుక్కుని సినిమా చూసి ఆనందించేవారు. నాటకాలు, తొలుబొమ్మలు రూపంలో ఎంతో చవకగా, చాలా మందికి ఉచితంగా ఉన్న ఒకప్పటి వినోదం అందేది. కాలక్రమేణా మారుతూ వచ్చిన సినిమా ఖరీదైన వినోదంగా, విలాసంగా, పెద్ద వ్యాపారంగా మారిపోయింది. 

ఈ ప్రక్రియలో పేద వాడికి ఒరిగింది ఏమీ లేదు. కేవలం వినోదం మాటున జేబుకు చిల్లు తప్ప. చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పంటలు పండించే రైతులు వంటి వారికి ఒక కొత్త బైక్‌ కొనుక్కోవడం జీవిత కాల స్వప్నంగా ఉంటుంది. అదే సినిమా నటులు, నిర్మాతలు మాత్రం కోట్లు ఖర్చుపెట్టి రోల్స్‌ రాయ్స్‌ కార్లు, విలాసవంతమైన భవనాలు, వేల ఎకరాల భూములకు అధిపతులుగా మారిపోయారు. వారి ఆర్ధిక ప్రగతిని కూడా పేదవాడు ఒక వినోదంలా చూడడమే తప్ప వారిలాగానే వ్యాపార ధోరణిలోనే తెలివిగల పేక్షకులుగా మారదామని ఏనాడూ ఆలోచించడు.

కానీ వ్యాపార ధోరణి సంతరించుకున్న వినోదాన్ని అందించే నిర్మాతలు, నటులు మాత్రం ఇంకా ఎంతో సంపన్నులుగా మారుతున్నారు. వేల కోట్లకు పడగలెత్తి పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు సృష్టిస్తున్నారు. రాజకీయ పార్టీలు స్థాపిస్తున్నారు. చివరిగా పాలకులుగా చెలామణి అవుతున్న విషయం మనం మన రాష్ట్రంలో, మిగతా చాలా రాష్ట్రాలలో చూస్తూనే ఉన్నాం. 

ఈ వినోదాదత్మక వ్యాపారంలో పేదవారు, ఉత్పత్తి ద్వారా సంపద సృష్టించే వెనుకబడిన కులాలకు ఏ విధమైన లాభం లేకుండాపోయింది. వారు కష్టపడి ఆర్జించిన కొద్దిపాటి ధనాన్ని కూడా ఈ వినోదం మాటున అగ్ర కులాలు దోపిడీ చేస్తున్నాయి. సినిమా గురించి ఇంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం, ఆలోచన చాలా మంది వెనుకబడిన మనుషులకు, మనసులకు ఉండదు. ఆ విధమైన ఆలోచన వచ్చిన రోజున సినిమా చవకైన వినోదంగా  తప్పకుండా అందుబాటులోకి వస్తుంది.

రచయిత:
మోదుగుమూడి రాజశేఖర్, ఏలూరు
మొబైల్‌ : 7995116053 
 

Source From: telugu cinema