తీరం దాటిన మిచాంగ్ తుఫాను


Published on: 05 Dec 2023 17:41  IST



ఏపీలో కల్లోలం రేపిన మిచాంగ్ తుఫాను మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటింది. దీంతో తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. వచ్చే కొద్ది గంటల్లో ఇది తుపానుగా బలహీనపడనుంది. అనంతరం 6 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మిచాంగ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పలు తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. తిరుపతి, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో అయితే వర్షాలు బీభత్సం సృష్టించాయి. తిరుపతి జిల్లా చింతవరంలో 42 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుండపోత వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ఈదురు గాలులకు అనేక చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు కూలిపోయాయి. పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనూ తుపాను ప్రభావం కనిపించింది. వరి, పొగాకు, పసుపు, అరటి పంటలు దెబ్బతిన్నాయి.

Source From: Migjaum cyclone