ది గ్రేట్‌ ఇండియన్‌ రెస్క్యూ - సిల్‌క్యారా శిథిలాల నుంచి బయటకు వచ్చిన 41 మంది కార్మికులు

17 రోజుల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఉత్కంఠకు తెరపడింది. ప్రమాదవశాత్తూ సొరంగంలో చిక్కుకొని ఆశ నిరాశల మధ్య క్షణమొక యుగంలా బిక్కుబిక్కుమంటూ గడిపిన 41 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. 60 మీటర్ల పొడవైన ఎస్కేప్‌ రూట్‌ ఏర్పాటు చేసిన స్టీల్‌ పైపు గుండా కార్మికులను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. గుహలాంటి సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులు బాహ్య ప్రపంచాన్ని కళ్లారా తిలకించి, గుండెనిండా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.


Published on: 29 Nov 2023 11:25  IST

ర్యాట్‌–హోల్‌ మైనింగ్‌ నిపుణులు సొరంగం లోపల మిగిలిన 12 మీటర్ల మేర శిథిలాల డ్రిల్లింగ్‌ పనులు పూర్తి చేశారు. వెంటనే భారీ స్టీల్‌ పైపును ఏర్పాటు చేసి, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కార్మికుల వద్దకు చేరుకున్నారు. ఒక్కొక్కరిని స్ట్రెచ్చర్లపై బయటకు చేర్చారు. స్టీల్‌ పైపు నుంచి బయటకు రాగానే కార్మికులకు వైద్య సిబ్బంది కొన్ని పరీక్షలు చేశారు. వారందరి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ చెప్పారు. అయినప్పటికీ వారిని ఇళ్లకు పంపించడానికి ముందు కొన్ని రోజులపాటు వైద్యుల పరిశీలనలో ఉంచాలని నిర్ణయించామని తెలిపారు. 41 మంది కార్మికులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. అధికారులు అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్సుల్లో కార్మికులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.


ఎప్పుడు ఏం జరిగిందంటే ! 

నవంబర్‌ – 12 : దీపావళి పండుగ రోజు ఉదయం 5.30 గంటలకు సిల్‌క్యారా–దందల్‌గావ్‌ మధ్య నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది. 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సొరంగంలోకి ఎయిర్‌–కంప్రెస్డ్‌ పైపుల ద్వారా ఆక్సిజన్, విద్యుత్, ఆహార పదార్థాలు పంపించడానికి ఏర్పాట్లు చేశారు. 


నవంబర్‌ 13 : సొరంగంలో ఉన్న కార్మికులతో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆక్సిజన్‌ కోసం ఉద్దేశించిన పైపుల గుండా అధికారులు మాట్లాడారు. క్షేమంగా ఉన్నామని కార్మికులు బదులిచ్చారు. అదేరోజు సొరంగం పైభాగం నుంచి మట్టి కూలింది. టన్నెల్‌ లోపల 60 మీటర్ల మేర మట్టి విస్తరించింది.


నవంబర్‌ 14 : దాదాపు 900 మిల్లీమీటర్ల వ్యాసార్థం ఉన్న స్టీల్‌ పైపులను సొరంగం వద్దకు చేర్చారు. మట్టి శిథిలాల గుండా సొరంగంలోకి ఈ పైపులను పంపించాలని నిర్ణయించారు. సొరంగంలో పైభాగం నుంచి మరింత మట్టి కూలడం ఆందోళన కలిగించింది. ఇద్దరు కారి ్మకులు స్వల్పంగా గాయపడ్డారు.


నవంబర్‌ 15 : కార్మికులను బయటకు తీసుకురావడానికి డ్రిల్లింగ్‌ యంత్రంతో తవ్వకం పనులు చేపట్టారు. అవి సవ్యంగా సాగకపోవడంతో అత్యాధునిక అగర్‌ మిషన్‌ను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. ఢిల్లీ నుంచి విమానంలో తీసుకొచ్చారు. 
నవంబర్‌ 17 : సొరంగంలో 57 మీటర్ల మేర మట్టి శిథిలాలు ఉండగా, 24 మీటర్ల మేర తవ్వకాలు జరిపారు. నాలుగు ఎంఎస్‌ పైపులను శిథిలాల గుండా పంపించారు. ఐదో పైపునకు అవరోధాలు ఎదురుకావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మరో అగర్‌ మెషీన్లో పనులు ప్రారంభించారు. ఐదో పైపును అమర్చే క్రమంలో సొరంగంలో భారీగా పగుళ్ల శబ్దాలు వినిపించాయి. సొరంగం మొత్తం కుప్పకూలే అవకాశం ఉండడంతో ఆ పనులు వెంటనే నిలిపివేశారు.


నవంబర్‌ 18  :1,750 హార్స్‌పవర్‌ కలిగిన అమెరికన్‌ ఆగర్‌ మెషీన్‌ వల్ల టన్నెల్‌ లోపల ప్రకంపనలు పుట్టుకొస్తున్నట్లు గుర్తించారు. ప్రత్యామ్నాయం కోసం అన్వేషించారు. ఐదు రకాల మార్గాలపై దృష్టి పెట్టారు. టన్నెల్‌ ఉపరితలం నుంచి లోపలికి నిలువుగా చేయాలని నిర్ణయించారు. 


నవంబర్‌ 19 : ఘటనా స్థలంలో సహాయక చర్యలను కేంద్ర మంతి నితిన్‌ గడ్కరీ స్వయంగా సమీక్షించారు. నిలువుగా కాకుండా ఆగర్‌ మెషీన్తో అడ్డంగా డ్రిల్లింగ్‌ చేస్తే బాగుంటుందని సూచించారు.
నవంబర్‌ 20 : టన్నెల్‌లో అడ్డంగా డ్రిల్లింగ్‌ చేస్తుండగా, ఆగర్‌ మెషీన్‌కు పెద్ద రాయి అడ్డుపడింది. పనులు నిలిచిపోయాయి.


నవంబర్‌ 21  : సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల మొదటి వీడియోను అధికారులు విడుదల చేశారు. ఆహారం తీసుకుంటూ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కార్మికులు కనిపించారు. తమ కుటుంబ సభ్యులతోనూ వారు మాట్లాడారు. సిల్‌క్యారా వైపు నుంచి అగర్‌ యంత్రంలో అడ్డంగా డ్రిల్లింగ్‌ పనులను అధికారులు పునఃప్రారంభించారు.


నవంబర్‌ 22 : 800 వ్యాసార్ధం కలిగిన స్టీల్‌ పైపులను శిథిలాల గుండా 45 మీటర్ల వరకు పంపించారు. మరో 12 మీటర్లే మిగిలి ఉంది. ఇంతలో మరో అవాంతరం వచ్చిపడింది. అగర్‌ మెషీను కొన్ని ఇనుప కడ్డీలు అడ్డం వచ్చాయి.


నవంబర్‌ 23 : అడ్డంగా ఉన్న ఐరన్‌ రాడ్లను తొలగించారు. శిథిలాల్లో అడ్డంగా 48 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ పూర్తయ్యింది. ఇక్కడ మరో ఉపద్రవం తప్పలేదు. అగర్‌ మెషీ నేను ఏర్పాటు చేసిన వేదికకు పగుళ్లు వచ్చాయి.


నవంబర్‌ 24 : పగుళ్లను సరిచేసి, డ్రిల్లింగ్‌ మళ్లీ ప్రారంభించారు. ఈసారి మెటల్‌ గిర్డర్‌ అడ్డు పడింది. దాన్ని తొలగించారు.


నవంబర్‌ 25 : అగర్‌ మెషీన్‌ బ్లేడ్లు శిథిలాల్లో ఇరుక్కున్నాయి. దీంతో రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తి కావడానికి మరికొన్ని వారాలు పడుతుందని భావించారు. మరో 12 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ మిగిలి ఉంది. కానీ, ఆ పనులు ఆపేయాలని నిర్ణయించారు.

నవంబర్‌ 26 : కార్మికులను క్షేమంగా బయటకు తీసుకురావడానికి ప్రత్యామ్నాయ మార్గం కోసం 19.2 మీటర్ల మేర నిలువుగా డ్రిల్లింగ్‌ పూర్తిచేశారు. 700 మిల్లీమీటర్ల వ్యాసార్ధం కలిగిన పైపులు పంపించే పనులు ప్రారంభించారు.

నవంబర్‌ 27 : 12 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ కోసం ర్యాట్‌ – హోల్‌ మైనింగ్‌ నిపుణులను రప్పిం చారు. అదే సమయంలో టన్నెల్‌ పై భాగం నుంచి నిలువుగా డ్రిల్లింగ్‌ 36 మీటర్ల మేర పూర్తయ్యింది. 


నవంబర్‌ 28 : సాయంత్రం 7 గంటలకల్లా డ్రిల్లింగ్‌ ఆపరేషన్‌ పూర్తయింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది స్టీల్‌ పైపు గుండా కార్మికుల వద్దకు చేరుకుని వీల్‌ స్ట్రెచర్లపై ఒక్కొక్కరినీ బయటకు తీసుకువచ్చారు. 
 

Source From: resuce operation