అతి పెద్ద ఐస్‌బర్గ్‌.. 40 ఏళ్ల తర్వాత కదులుతోంది

అది ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్‌బర్గ్‌. దాని పేరు ఏ23ఏ. దాని విస్తీర్ణం ఏకంగా 4,000 చదరపు కిలోమీటర్లు. అంటే పరిమాణంలో గ్రేటర్‌ లండన్‌ కంటె రెండింతలు ఎక్కువ ఉంటుంది. అంతటి విస్తీర్ణం, సైజుతో చూడ్డానికి అది ఒక మంచు ద్వీపకల్పంలా ఉండేది. అలాంటి ఐస్‌బర్గ్‌ దాదాపు 40 ఏళ్ల తర్వాత కదలడం మొదలు పెట్టింది. ఈ పరిణామం పర్యావరణ నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. గ్లోబల్‌ వార్మింగ్‌ దుష్పరిణామాలకు ఇది ఒక తాజా సంకేతమని వారు భావిస్తున్నారు.


Published on: 25 Nov 2023 12:10  IST

1986లో అంటార్కిటికా నుంచి విడిపోయింది..

World's largest iceberg A23a breaks free after 30 years: What you need to  know

    ఈ ఐస్‌ బర్గ్‌ 1985 చివర్లో అంటార్కిటికా తీరం నుంచి విడిపోయింది. అంటార్కిటికాకి సంబంధించిన అతి పెద్ద ఫిల్షనర్‌ మంచు ఫలకం నుంచి విడిపోయిన భారీ ఐస్‌బర్గ్‌ల్లో పెద్దదిగా ఇది రికార్డులకెక్కింది. అప్పటికే దీనిపై సోవియట్‌ యూనియన్‌ ఒక పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసుకుంది. విడిపోవడం మొదలవడంతో అందులోని సామగ్రిని అది హుటా హుటిన తరలించేసింది. ఆ తర్వాత కానీ కొద్దిపాటి ప్రయాణం ఆనంతరం 1988కల్లా అంటార్కిటికా పరిధిలోని వెడెల్‌ సముద్రంలో ఈ ఐస్‌బర్గ్‌ కదలకుండా నిశ్చలంగా ఉండిపోయింది.  ఒకరకంగా సముద్రం అడుగు భాగంతో కలిసిపోయి అలా నిలబడి పోయింది.

ఇప్పుడు కరుగుతోంది..

ఇంతకాలం నిశ్చలంగా ఉండి ఇప్పుడు మళ్లీ కదలడం ప్రారంభించింది. అంటార్కిటికా సముద్ర జలాల ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుండడం వల్లే దీన్లో కదలిక మొదలైందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. దాదాపు 40 ఏళ్ల కాల గమనంలో ఈ ఐస్‌బర్గ్‌ చాలావరకు కుచించుకుపోయింది. దానికి గ్లోబల్‌ వార్మింగే కారణమని తేలింది. వాస్తవానికి ఈ ఐస్‌బర్గ్‌లో 2020లోనే అతి తక్కువ స్థాయిలో కదలికలు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. సముద్ర పవనాల హోరు, ప్రవాహాల జోరుకు అది ఇప్పుడు వేగం పుంజుకుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది క్రమంగా అంటార్కిటిక్‌ ద్వీపకల్పపు ఉత్తరం వైపు కదులుతోంది. చివరికి అది ఐస్‌ బర్గ్‌ల క్షేత్రంగా పిలిచే అంటార్కిటికా దక్షిణ ప్రాంతానికి చేరేలా కన్పిస్తోంది.

డేంజరే !

A23a: World's biggest iceberg on the move after 30 years

ఎంత పెద్ద ఐస్‌ బర్గ్‌ అయినా కాలక్రమంలో చిక్కిపోవడం, క్రమంగా కనుమరుగవడం మామూలే. అందుకు వందలు, కొన్ని సార్లు వేలాది ఏళ్లు కూడా పడుతుంటుంది. అలాంటి ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన ఏ23ఏ ఐస్‌బర్గ్‌ ఇలా శరవేగంగా కరుగుతుండటం, కదిలిపోతుండటం ప్రమాద సూచికేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది దక్షిణ జార్జియా కేసి సాగితే అక్కడి జీవావరణానికి పెద్ద సమస్యగా కూడా మారవచ్చని చెబుతున్నారు. దాని నుంచి కరిగే నీటితో పెరిగిపోయే సముద్ర మట్టం ఆ ద్వీపకల్ప తీరంలో లక్షలాది సీల్స్, పెంగ్విన్లు, సముద్ర పక్షుల పునరుత్పత్తి ప్రాంతాలను ముంచెత్తవచ్చన్నది వారి ఆందోళన. 

లాభాలూ ఉన్నాయ్‌ !

ఈ పరిణామంతో కొన్ని లాభాలూ ఉన్నాయంటున్నారు. ఐస్‌బర్గ్‌లు జీవనప్రదాలు కూడా. కరిగే క్రమంలో వాటినుంచి విడుదలయ్యే ఖనిజ ధూళి సమీప సముద్ర జీవజాలానికి ప్రాణాధారంగా మారుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.
 

Source From: a23a iceberg