భూముల గొడవలన్నింటినీ తీర్చే చట్టం ఇది

భూముల వివాదాలన్నింటికీ పులుస్టాప్‌ పెట్టే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ఏపీలో అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకు భూమిపై హక్కు ఎవరిదో నిర్థారించే హక్కు దేశంలో సివిల్‌ కోర్టులకు మాత్రమే ఉంది. ఈ చట్టం ద్వారా కొత్తగా ఏర్పాటయ్యే ల్యాండ్‌ అథారిటీ, ల్యాండ్‌ టైట్లింగ్‌ ఆఫీసర్‌లు భూమిపై హక్కులు నిర్థారిస్తారు. వారి నిర్ణయం సరికాదనుకుంటే రెవెన్యూ ట్రిబ్యునల్‌లో అప్పీల్‌ చేసుకోవాలి తప్ప కోర్టులకు వెళ్లడానికి అవకాశం ఉండదు. ట్రిబ్యునళ్ల స్థాయిలోనూ న్యాయం జరగలేదనుకుంటే అప్పుడు హైకోర్టులో అప్పీల్‌ చేయవచ్చు. అంతేతప్ప ప్రతి దానికి సివిల్‌ కోర్టులకు వెళ్లే అవకాశం సమీప భవిష్యత్తులో ఉండదు. భూముల వ్యవహారాలను ఆసాంతం మార్చే చట్టం ఇది. ఇది పూర్తిగా అమలైతే రాష్ట్రంలో భూముల వ్యవహారాలే సమూలంగా మారిపోతాయి.


Published on: 15 Nov 2023 11:07  IST


  దేశంలోనే మొట్ట మొదటిసారిగా రాష్ట్రంలో భూ హక్కుల చట్టం (ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌) అమల్లోకి వచ్చింది. ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం–2023 ఈ సంవత్సరం అక్టోబర్‌ 31వ తేదీ నుంచి అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఇటీవల జీఓ నెంబర్‌ 512 జారీ చేసింది. దానికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా డుదలైంది. ఇటీవలే ఈ చట్టానికి  రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. భూ యజమానులు, కొనుగోలుదారులకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఇచ్చేలా ఈ చట్టాన్ని రూపొందించారు. ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి చట్టం లేదు. తొలిసారి మన రాష్ట్రంలోనే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విప్లవాత్మకమైన రీతిలో దీన్ని తీసుకువచ్చింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 జులైలోనే ఈ చట్టానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. దాన్ని కేంద్రం అనుమతి కోసం పంపగా పలు మార్పుల తర్వాత ఇటీవలే దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. దీంతో ఆ చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో భూముల రీ సర్వే ప్రారంభ సమయంలోనే ప్రభుత్వం ఈ చట్టానికి రూపకల్పన చేసింది. కేంద్రం ఆమోదం ఆలస్యమవడంతో రీ సర్వేను కొనసాగించింది.


రాష్ట్ర స్థాయిలో ఏపీ ల్యాండ్‌ అథారిటీ.. 
మండల స్థాయిలో టైట్లింగ్‌ ఆఫీసర్‌..
  భూ హక్కుల చట్టం ప్రకారం స్థిరాస్థి హక్కుల రిజిష్టర్‌ను తయారు చేస్తారు. స్థిరాస్థిని యజమాని తప్ప వేరే ఎవరూ విక్రయించే అవకాశం ఉండదు. రాష్ట్రంలోని మొత్తం స్థిరాస్థులకు సంబంధించిన శాశ్వత రిజిష్టర్, వివాద రిజిష్టర్‌తోపాటు కొనుగోలు రిజిష్టర్‌లు రూపొందిస్తారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను సవరిస్తారు. అలాగే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి నేతత్వంలో ఏపీ ల్యాండ్‌ అథారిటీని ఏర్పాటు చేస్తారు. ఆ అధికారి కింద మండల స్థాయిలో ల్యాండ్‌ టైట్లింగ్‌ అధికారులను నియమిస్తారు. భూమి హక్కులను రిజిష్టర్‌ చేసే బాధ్యత లాం్యడ్‌ టైట్లింగ్‌ అధికారికే ఉంటుంది. పలు దశల తర్వాత టైట్లింగ్‌ అధికారి భూముల యజమానులను శాశ్వత హక్కుదారులుగా గుర్తించి రిజిష్టర్‌లో నమోదు చేస్తారు. వీటిపై ఎవరూ కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ ట్రిబ్యునళ్లలో తేల్చుకోవడం తప్ప కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉండదు. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్‌ తీర్పులపైనే హైకోర్టులో సవాల్‌ చేసే అవకాశం ఉంటుంది. 

 

Source From: Telugu Peoples