త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి 'ఖైదీ' సీక్వెల్!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 'ఖైదీ' సినిమాకి ప్రత్యేక స్థానముంటుంది. 1983లో వచ్చిన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. చిరంజీవి స్టార్డంని అమాంతం ఎన్నో రెట్లు పెంచేసిన చిత్రమిది. అలాంటి సంచలన సినిమాకి 40 ఏళ్ళ తర్వాత సీక్వెల్ తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ సీక్వెల్ కోసం చిరంజీవి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేతులు కలుపుతున్నట్లు సమాచారం.


Published on: 03 Oct 2023 19:36  IST

చిరంజీవి, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రావాలని కోరుకునే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. చిరంజీవి కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. అలాగే త్రివిక్రమ్ తనదైన పంచ్ డైలాగ్స్ తో కడుపుబ్బా నవ్విస్తారు. అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది. అయితే ఇప్పటిదాకా వీరి కాంబోలో ఒక్క సినిమానే వచ్చింది. అదే 'జై చిరంజీవ'. అయితే ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకుడు కాదు రచయిత. ఈ మూవీలో త్రివిక్రమ్ రచనలో చిరంజీవి పండించిన హాస్యానికి ఎందరో అభిమానులున్నారు. ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ చేయాలని చిరు-త్రివిక్రమ్ భావిస్తున్నారట.

 

"పగ తీర్చుకోవడం కోసమే ఈ జన్మ ఎత్తాను. ప్రేమ కోసం మరో జన్మ ఎత్తుతాను. అప్పుడు కలుసుకుందాం" అనే డైలాగ్ తో ఖైదీ సినిమా ముగుస్తుంది. అదే లైన్ ని స్టోరీగా తీసుకొని సినిమా తీయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సీక్వెల్ చేయడానికి చిరంజీవి సైతం ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబుతో 'గుంటూరు కారం' చేస్తున్న త్రివిక్రమ్.. ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఓ ప్రాజెక్ట్ కమిటై ఉన్నారు. అయితే బన్నీ ప్రాజెక్ట్ కంటే ముందే 'ఖైదీ' సీక్వెల్ పట్టాలెక్కే అవకాశముంది అంటున్నారు. మరోవైపు చిరంజీవి ప్రస్తుతం 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

Source From: Telugu Peoples