కూటమి పాలనలో వ్యవసాయంపై దారుణ నిర్లక్ష్యం: వరుదు కళ్యాణి

రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. అసెంబ్లీ బయట మీడియా పాయింట్ లో ఆమె మాట్లాడుతూ అడుగడుగునా రైతులను మోసం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు పెట్టుబడి సాయం లేదు, మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతన్నలు కుదేలవుతున్నా ఈ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.


Published on: 11 Mar 2025 20:12  IST

అమరావతి: శాసనమండలిలో ఈ రోజు వ్యవసాయంపై జరిగిన లఘు చర్చల్లో రైతున్నల పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య దోరణి బయటపడింది. రైతులను ఆదుకోవడంలో, అండగా నిలవడంలో ఈ ప్రభుత్వం దారుణంగా  విఫలమయ్యింది. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు మేనిఫేస్టోలో చాలా స్పష్టంగా అన్నదాత సుఖీభవ పేరుతో పెట్టుబడి సాయంగా ప్రతి రైతుకు ఏటా రూ.20 ఇస్తామని చెప్పారు. దానిలో ఆరువేల రూపాయలు కేంద్రం ఇస్తుంది, మిగిలిన రూ.14 వేలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు తాజాగా బడ్జెట్లో కేటాయింపుల్లో కేంద్రం ఇచ్చే దానితో కలిపి అని చెప్పడం రైతులను మోసం చేయడమేనని వరుదు కళ్యాణి అన్నారు. 

- రాష్ట్రంలో రైతుల స్థితి ధైన్యం

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడా గిట్టుబాటు ధరలు లభించడం లేదు. మరోవైపు పంట నష్టపోయిన సందర్భంలో రైతులను ఆదుకునే చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. ఒకవైపు ప్రకృతి ప్రతికూలత, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రెండు విధాలుగా రైతులు నష్టపోతున్నారు. ఈ ప్రభుత్వం కాలనాగులా రైతులను కాటేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదినెలలు కావొస్తోంది. పంట విస్తీర్ణం 86 లక్షల ఎకరాల నుంచి 70 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. దీనిలో తుఫానులు, వరదలు, కరువు వల్ల మరో పదిలక్షల ఎకరాల్లో సాగు దెబ్బతిన్నది. ఈ తరుణంలో రైతులకు పంట నష్ట పరిహారం, పెట్టుబడి సాయం అందించాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో నాసిరకం విత్తనాలు, ఎరువులతో రైతులు దగా పడుతున్నారు. నాణ్యమైన విత్తనాలు ఎక్కడా అందుబాటులో లేకుండా పోయాయి. కనీసం పండించిన పంటకు మద్దతుధర లేకుండా పోయింది. మిర్చి, టమాట, ధాన్యంకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోయారు. మార్కెట్ ఇంట్రవెన్షన్ కింద కనీసం ప్రభుత్వం పంట కొనుగోళ్ళు చేయడం లేదు. 

- రైతుకు దగ్గని గిట్టుబాటు ధరలు

వైయస్ జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు మిర్చి పంట క్వింటాకు రూ.21000 నుంచి రూ.27000 వరకు ధర పలికేది. ఇటీవల మిర్చి రేటు క్వింటా రూ.9 వేలకు పడిపోయింది. వైయస్ జగన్ గారు గుంటూరు మిర్చియార్డ్ కు వెళ్ళి రైతులను పరామర్శించిన తరువాతే కూటమి ప్రభుత్వానికి మిర్చి రైతుల గోడు వినిపించింది. మిర్చి కొనుగోళ్ళకు కేంద్రానికి లేఖ రాశామంటూ ముఖ్యమంత్రి ప్రకటించి చేతులు దులుపుకున్నారు. అలాగే టమోటా ధరలు దారుణంగా పతనమయ్యాయయి. కిలో ఎనిమిది రూపాయలకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పినా ఒక్క కిలో కూడా కొనుగోలు చేయలేదు. ఆలాగే పత్తి ధర గత ఏడాది క్వింటా రూ.10వేలు ఉంటే ఈ రోజు రూ.5 వేలు దాటడం లేదు. 

- పంటనష్టంపై ఆదుకునే చర్యలు శూన్యం 

గత ఏడాది జూలైలో ప్రకృతి ప్రతికూలత వల్ల 44,578 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీనిలో నష్టపోయిన 31,666 మంది రైతులకు పరిహారం కింద రూ. 31.53 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అలాగే అక్టోబర్‌లో 25,152 ఎకరాల్లో 16,504 మంది రైతులు మొత్తం రూ.14.42 కోట్లు నష్టపోయారు. నేటికీ వారికి పరిహారం ఇవ్వలేదు. అలాగే ఖరీఫ్ లో కరువు వల్ల 2,36,205 ఎకరాల్లో మొత్తం 1,41,389 మంది రైతులకు గానూ రూ.143.10 కరువు సాయం అందించాల్సి ఉన్నా, నేటికీ ఇది చెల్లించలేదు. అలాగే నవంబర్ నెలలో పెయింజల్ తుపాను వచ్చింది. దీనివల్ల మొత్తం 21,713 ఎకరాల్లో పంట దెబ్బతిన్నది, మొత్తం 14,437 మంది రైతులు రూ.11.43 కోట్లు నష్టపోయారు. డిసెంబర్ లో అధికవర్షాల వల్ల 16,173 ఎకరాల్లో 10,118 మంది రైతులు నష్టపోగా వారికి రూ.7.61 కోట్లు పరిహారం చెల్లించలేదు. అలాగే 2023-24 రబీ సీజన్ లో ప్రకృతి వైఫరీత్యాల వల్ల 4,12,803 ఎకరాల్లో 1,58,470 మంది రైతులు నష్టపోయారు. వారికి రూ.164.05 కోట్లు పరిహారం ఇవ్వాల్సి ఉన్నా, నేటికీ దానిని ఇవ్వలేదు. ఇంత దారుణంగా వ్యవహరిస్తూ వ్యవసాయ రంగాన్ని ఉద్దరిస్తున్నట్లు వ్యవసాయ మంత్రి చెప్పడం దారుణం.

- ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు

వైయస్ఆర్‌సీపీ హయాంలో విత్తనం నుంచి విక్రయం వరకు ప్రభుత్వమే చూసుకునేది. ఆర్బీకేల ద్వారా రైతులకు అండగా నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైయస్ఆర్‌సీపీ హయాంలో వ్యవసాయ రంగంలో 12.97 శాతం వృద్ది రేటు సాధించడం జరిగింది. ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతులను ఆదుకున్నారు. సున్నావడ్డీ రుణాలు, ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించారు. కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకున్నారు. ఈ-క్రాప్ ద్వారా పంటల దిగుబడులను గుర్తించడం, గిట్టుబాటు ధరలను కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ధరలు పతనమైన సందర్బాల్లో ప్రభుత్వమే నేరుగా పంటలను కొనుగోలు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఇన్‌పుట్ సబ్సిడీని కూడా సకాలంలో అందించారు. పదివేలకు పైగా రైతుభరోసా కేంద్రాలను నిర్మించడం, పదివేలకు పైగా అగ్రికల్చర్ అసిస్టెంట్ లను నియమించారు. గతంలో ఎన్నడూ ఇలా నియామకాలు చేయలేదు. వ్యవసాయానికి వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. రూ.10,050 కోట్లు వ్యవసాయ యంత్రాల కోసమే ఖర్చు చేశారు. రైతులకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం రూ.3200 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది. కూటమి పాలన పదినెల్లోలనే వ్యవసాయ రంగం కుదేలయ్యింది. రైతుల జీవితాలు తల్లకిందులు అయ్యేలా చేస్తున్నారు. ఇప్పటి కైనా ఎన్నికల సమయంలో రైతులకు, వ్యవసాయానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.

Source From: రాజాజీ