కొత్త ఉద్యోగాలు భ్రమ... నిరుద్యోగభృతి మిధ్య : మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ఆగ్రహం

రాష్ట్రంలో యవతను, విద్యార్ధులను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకే ఈ నెల 12వ తేదీన వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 'యువత పోరు' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ తెలిపారు. అనంతపురం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్యరంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు కల్పన లేదు, నిరుద్యోగభృతి అమలు అంతకంటే లేదు, చివరికి విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంకు కూడా తూట్లు పొడిచే దుర్మార్గ పాలనను చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Published on: 10 Mar 2025 16:24  IST

అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం వ్యాపార ధోరణితోనే పాలన సాగిస్తున్నారు. ఈ రోజు గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వివిధ నగరాల్లో ఐటీ, వృత్తి నిపుణులుగా యువత ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే దానికి కారణం ఆనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం. దానిని కొనసాగిస్తున్న వైయస్ జగన్ గారి కృషి. ఈ రోజు పేద, మద్యతరగతి వర్గాల నుంచి కూడా లక్షలాది మంది ఐటీ నిపుణులుగా అనేక ప్రాంతాల్లో  తయారవుతున్నారంటే దాని వెనుక ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం ఉంది. కుల, మతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేసిన స్వర్గీయ వైయస్‌ఆర్  ఘనత ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపిందని శైలజానాథ్ అన్నారు.  

- ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అరకొర కేటాయింపులా?

నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్ధులకు రూ.3900 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. తాజా బడ్జెట్‌లో మాత్రం కేవలం రూ.2600 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే మొత్తం విద్యార్ధులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ ను అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీసేందుకు ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్దులు, వారి తల్లిదండ్రులతో కలిసి వైయస్‌ఆర్‌సీపీ యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. స్కూళ్ళకు వెళ్ళే విద్యార్ధులను ప్రోత్సహించేందుకు వైయస్ జగన్ గారు దేశంలోనే తొలిసారిగా అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టి దానిని విజయవంతంగా అమలు చేశారు. దానిని కాపీకొట్టి తల్లికి వందనం పేరుతో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఈ పథకాన్ని తొలి ఏడాది పూర్తిగా ఎత్తేశారు. కనీసం ఈ ఆర్థిక సంవత్సరంలో అయినా అమలు చేస్తారని ఆశిస్తుంటే, ఈ పథకానికి అరకొరగా చేసిన కేటాయింపులను చూస్తే చంద్రబాబు ఉద్దేశం ఏమిటో అర్థమవుతోంది. 

- నిరుద్యోగులను మోసం చేసిన కూటమి సర్కార్

రాష్ట్రంలోని నిరుద్యోగులను కూడా కూటమి సర్కార్ నిలువునా మోసం చేసింది. 2014-19లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం నిరుద్యోగులకు భృతి ఇస్తామంటూ ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. వారి పార్టీలోని రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే భృతి కల్పించి, నిరుద్యోగులను మోసం చేశారు. తిరిగి తాజా ఎన్నికల్లో వైయస్ జగన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున బురదచల్లుతూ కూటమి పార్టీలను గెలిపిస్తే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు, నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామంటూ ఆశలు కల్పించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు దీనిపై బడ్జెట్‌లో కనీస కేటాయింపులు కూడా చేయ లేదు? ప్రతిసారీ వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసింది, అందువల్లే సూపర్ సిక్స్ అమలు చేయలేకపోతున్నామంటూ చంద్రబాబు పదేపదే అబద్దాలు చెప్పారు. తీరా బడ్జెట్ లెక్కల్లోనే  గతంలోని తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పులతో సహా కలిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి ఉన్న మొత్తం రాష్ట్ర అప్పులే రూ.7 లక్షల కోట్లు అని తేలిపోయింది. ఇప్పటికైనా గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందనే నిందలను, దుష్ర్పచారాన్ని కట్టిపెట్టి నిజాయితీగా ఎందుకు నిరుద్యోగులకు భృతిని ఇవ్వడం లేదో  చెప్పాలి. ఎన్నికల నాడు ఇచ్చిన హామీ మేరకు తక్షణం నిరుద్యోగభృతిని చెల్లించాలి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే పదహారు వేల టీచర్ పోస్ట్‌లతో మెగా డీఎస్సీని ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్ ను ఎందుకు జారీ చేయడం లేదు? పదేపదే ఎందుకు నోటిఫికేషన్ ను వాయిదా వేస్తూ వస్తున్నారు?  

- కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రవేటీకరించే కుట్ర

చంద్రబాబు పాలన పూర్తిగా వ్యాపారాత్మకంగా సాగుతోంది. ఎక్కడైతే లాభాలు ఉంటాయో వాటిపైనే చంద్రబాబు దృష్టి సారిస్తున్నారు. విద్యారంగంలో ప్రైవేటు స్కూళ్ళ ఆధిపత్యానికి కారణం చంద్రబాబు. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తరువాత నుంచి ఇప్పటి వరకు కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉంటే, వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా రూ.8 వేల కోట్ల ఖర్చుతో ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అందులో అయిదు కాలేజీలు నిర్మాణం పూర్తయ్యి, తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం మిగిలిన కాలేజీలను పూర్తిగా నిర్వీర్యం చేయడం, ప్రైవేటు వ్యక్తులకు అప్పటించేందుకు కుట్ర చేస్తోంది. కొత్త మెడికల్ కాలేజీలకు సీట్లు కేటాయిస్తామంటూ కేంద్రం ముందుకు వస్తే, మౌలిక సదుపాయాలు లేవు, మాకు మెడికల్ సీట్లు వద్దంటూ రాష్ట్రప్రభుత్వం లేఖ రాయడం దుర్మార్గం కాదా? కేవలం తొమ్మిది నెలల్లో రూ.1.19 లక్షల కోట్లు అప్పులు చేశారు. దీనిలో కొంతమేరకు అయినా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కేటాయిస్తే రాష్ట్రానికి చెందిన విద్యార్ధులకు ఎంత మేలు జరిగేదో. కానీ చంద్రబాబుకు ప్రభుత్వరంగంలో మెడికల్ కాలేజీలను నిర్వహించడం ఇష్టం లేదు. ప్రైవేటు వ్యక్తులకు ఆ కాలేజీలను అప్పగించాలన్నదే చంద్రబాబు లక్ష్యం. ఈ కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే విధానానికి నిరసనగా, ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలనే డిమాండ్ తో రేపు జరిగే యువత పోరులో విద్యార్ధులు, యువత తమ నిరసనను ప్రకటించబోతోంది. 

- మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... 

కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది కూడా పూర్తి కాలేదు. ఎన్నికల కోసమే సత్యదూరమైన వాగ్ధానాలు చేశారు. అన్ని వర్గాలకు ఆశ చూపించారు. అంగన్ వాడీలకు అన్ని సదుపాయాలు కల్పించి, జీతాలు పెంచుతామని మాట ఇచ్చారు. అంగన్ వాడీలు, ఆశావర్కర్లు, వలంటీర్లు అందరికీ ఇలానే వాగ్ధానాలు చేశారు. వాటిని నెరవేర్చకుండా ఇప్పుడు మాట తప్పుతున్నారు. ఇప్పుడు ఆ వర్గాలే ఈ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడం లేదంటూ ఆందోళనలుకు దిగాయి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు చేస్తున్న ఆందోళనలకు వైయస్‌ఆర్‌సీపీ పూర్తి మద్దతు ఇస్తోంది. వారి డిమాండ్ లపై కూడా తక్షణం ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాం.

Source From: Telugu Peoples

లేటెస్ట్ న్యూస్